Image Courtesy : Wikipedia

ప్రధమవయసి పీతం తోయమల్ఫం స్మరంతః
శిరసి నిహితభారా నారికేలా నరాణామ్!
సలిలమమృతకల్ఫం దద్యురాజీవితాంతం
న హి కృతముపకారం సాధవో విస్మరంతి!!

Image Courtesy : Wikipedia

భావం:

కొబ్బరి చెట్టు మొక్కగా ఉన్న దశలో మనం పోసిన నీరు తాగి వృక్షంగా ఎదుగుతుంది.అందుకు కృతజ్ఞతగా అది జీవితాంతం తన నెత్తిమీద కొబ్బరికాయల బరువు మోసి అమృతం వంటి నీటీని మనకు అందిస్తుంది. అలాగే మంచివారు కూడా ఇతరులు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోరు.

వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. అష్టాదశ పురాణాలలో పదమూడోది స్కాందపురాణం. “స్కాంద పురాణం రోమాని” అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి రోమాలతో పోల్చబడిందని తెలుస్తోంది. “ఏకాశీతి సహస్రాంతు స్కాందం సర్వాఘకృంతనమ్” అనగా సకల పాపాలను పోగొట్టే ఈ పురాణంలో మొత్తం 81 వేల శ్లోకాలున్నాయి. “యత్రస్కందః స్వయంశ్రోతా వక్తాసాక్షాన్మహేశ్వరః”. పరమేశ్వరుడు స్వయంగా ఈ పురాణాన్ని ఉపదేశిమ్చగా శ్రద్ధగా విన్న స్కందుడు తిరిగి దాన్ని మహామునులకి తాను ఉపదేశించాడు. అన్ని పురాణాల కన్నా స్కాందపురాణం చాలా పెద్దది.

ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తి తోసహా లక్షీకటాక్షం కొఱకు తీర్థయాత్రలకు బయలుదేరారు.

మహదానందంతో వారెన్నో తీర్థాలు దర్శించినారు.

ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు తొఱ్ఱలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూచి ఇంద్రాది దేవతలు “పక్షీశ్వరా! ఈ వృక్షం బాగా శుష్కించియున్నది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు” అని అడిగినారు.

Image Courtesy : Wikipedia

 చిలుక ఇలా బదులిచ్చింది

“ఓ దేవతలారా! ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరి తరమ్? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతఘ్నత అవుతుంది. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా! నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్నూ”.

ఇలా ధర్మం మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు
 “ఓ శుక రాజమా! నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు”.

అప్పుడు చిలుక ఇలా చెప్పింది “నేను ఎన్నడూ మిత్రద్రోహం చేయలేదు. తల్లిదండ్రులయందు అనురాగం కలవాడను.
నా భార్యను బాగా చూసుకుంటాను.
 నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను.

ఈ కారణాలవలన నాకు నిర్మలజ్ఞానం కలిగింది”.

Image Courtesy : Wikipedia

చిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు.

 “అయ్యా! నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయుతే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి” అని శుకం బదులిచ్చింది.

దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు.

 ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు.

తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది.

మనకు నీడనిచ్చిన ఇంటిని మనకు అన్నంపెట్టిన నేలతల్లిని (దేశాన్ని) ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్లు త్యజించినవాడు కృతఘ్నుడౌతాడని శుకరాజం చెప్పింది.

అలాగే మనం మనకు ప్రత్యంక్షంగా పరోక్షంగా సహాయపడ్డ వారందరితో కృతజ్ఞతా భావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు.

స్కంద పురాణం వ్యాసుడు రచించిన ఆష్టాదశ పురాణలలో ఒకటి. ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం 7 ఖండాలుగా విభజించబడింది. ఈ పురాణంలో హిందూ ధర్మ శాస్త్రాలకు సంభందించిన అనేక విషయాలు మాత్రమే కాక మానవ జీవిత మనుగడకు సంభందించిన విశేషాలు కూడా ఉన్నాయి. అందులో ఈ కథ చాలా ప్రాముఖ్యమైనది.

Previous article‘హనుమాన్  దీక్ష’ తీసుకున్న ఎన్టీఆర్ …విధి విధానాలు
Next article‘సుందరకాండ’ పారాయణ పద్ధతులు, ఇలా చేస్తే ఫలితం వెంటనే